20, మే 2023, శనివారం

మల్లెకు మనసుంటే -1


ఆహా!!! ఏమి నా అదృష్టం...... నేను మానవాళికి దొరికిన గొప్ప బహుమతి.... అరవిరిసిన అందంతో..... నేను దోచిన మగువల చూపులేన్నో... దోసిలి నిండుగా తన్మయత్వంతో..... స్పృశించి మురిసిన మగువల మనసులెన్నో.... పూలలో రాణిగా విరాజిల్లే...... నా సోయగాలు చూసి అసూయపడ్డ పువ్వులేన్నో.... వెన్నెల రాత్రుల్లో సువాసన పరిమళాలతో... పెంచిన ఎద స్పందనలెన్నో...... మానవ భక్తికి పరవశించి,,,,, జాతికి భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం నేను..... ఏమి నా సౌభాగ్యం!!!!!!.....

"పుస్తక పఠన ప్రాముఖ్యత ".....

రేఖను కలిసి చాలా కాలం అయింది. ఒకసారి వెళ్లి కలుద్దాం అనుకుంది సుష్మ. అనుకుందే తడువుగా తన బైక్ మీద పది నిమిషాల్లో రేఖ వాళ్ళ ఇంటి డోర్ కాలింగ్ బెల్ కొట్టింది.
రేఖ వాళ్ళ అమ్మగారు డోర్ తెరవగానే,
హాయ్ అంటీ... ! ఎలా ఉన్నారు? అని అడిగింది సుష్మా.
నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావ్?
ఏంటి ఈ మధ్య ఇంటికి రావడమే తగ్గించేసావు? రా..,రా.., అని ఇంట్లోకి ఆహ్వానించింది.
అందుకే ఈరోజు అంతా మీ ఇంట్లోనే గడుపుదామని వచ్చేసాను ఆంటీ అని చెప్పింది సుష్మా.
మంచి పని చేశావు. భోజనానికి నీకు ఇష్టమైనవన్నీ రెడీ చేసి పెడతాను తిని వెళ్ళాలి.
ఓ తప్పకుండా!! ఆంటీ.
ఇంతకి రేఖ ఏం చేస్తుంది? ఎక్కడా మాట కూడా వినపడటం లేదు?
అదిగో బాల్కనీలో కూర్చుని ఏవో బుక్స్ చదువుకుంటుంది. సరే ఆంటీ నేను రేఖ దగ్గరకు వెళ్తాను. అలాగే సుష్మా మీరు మాట్లాడుతూ ఉండండి. నేను ఈలోగా వంట రెడీ చేస్తాను అని అన్నది రేఖ వాళ్ళ అమ్మగారు.

**************

ఈ రేఖ ఏం చేస్తుంది? మెల్లగా వెళ్లి చూద్దాం అనుకొని మెల్లగా రేఖ ఉన్న రూమ్ లోకి వెళ్లి డోర్ వెనక దాక్కుంది సుష్మ .
ఏదో అలికిడి అయినట్టుగా అనిపించి వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న సుష్మను చూసిన వెంటనే ఏయ్ రాక్షసి నువ్వా??? ఏమిటి సంగతి???
చాలా రోజులకు గుర్తొచ్చాను అని రేఖ అడిగింది. నీకు మేము ఎలాగూ గుర్తు రాము. అందుకే నేనే నిన్ను గుర్తు చేసుకొని ఎలా ఉన్నావో ?పలకరించి వెళ్దాం అనిపించి వచ్చాను. అని సమాధానం ఇచ్చింది సుష్మా.
అదేమీ లేదే నీకు తెలుసుగా నేను ఎవరితో పెద్దగా కలవలేను అందుకే ఎక్కడికి రాను. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా,ఇంతలో రేఖ వాళ్ళ అమ్మగారు భోజనానికి రమ్మని పిలిచారు. ముగ్గురు కూర్చుని తినడం మొదలు పెట్టారు.


అయినా ఆంటీ నాకో డౌట్
"పుస్తకం ఉంటే రేఖకు ప్రపంచమే కనపడదు...
పుస్తకాలు అంటే అంత పిచ్చి ఎందుకు?" అని అడిగింది సుష్మా...


పుస్తకాలు అంటే పిచ్చి కాదమ్మా!!! ప్రాణం...

పుస్తకపఠనం అలవాటు అయితే
ఒక పూట తినకపోయినా ఉండగలుగుతాము కానీ, ఒక పేజీ అయినా చదవకపోతే నిద్ర పట్టదు..
ఈ మందు తాగడం, పొగ పీల్చడం ఎలాంటి హానికరమైన వ్యసనాలో,????
పుస్తక పఠనం అనేది కూడా ఒక వ్యసనం.. కానీ ఇది హానికరమైనది కాదు అంతే తేడా...

ఉదాహరణకి రీసెంట్ హిట్ మూవీ " RRR" సినిమా మనం చూసి చాలా ఎంజాయ్ చేసాము. షూటింగ్ అంతా పూర్తి చేసుకుని, ఎడిటింగ్ , డబ్బింగ్ అన్నీ పూర్తయ్యాక సినిమా థియేటర్స్ లో చూసి చాలా అద్భుతంగా ఉంది అని మనకు అనిపించింది...
కానీ ఆ స్టోరీ రాయడం పూర్తయ్యాక డైరెక్టర్ ముందే తన ఊహ శక్తితో సినిమాని ముందే తన ఊహ ప్రపంచంలో చూసేస్తాడు.. ఈ పాత్రకి వీరైతే తగిన న్యాయం చేస్తారు అని ముందుగానే ఆలోచించి తన ఊహలో ఉన్న దానిలానే అనిపించాకే పనులన్నీ పూర్తి చేసి రిలీజ్ చేస్తారు.. అది వారికున్న "పుస్తక పఠనం" అనే అలవాటు వలన వారు ప్రతిదీ ఊహించుకుంటారు....

"పుస్తకాలు అంటే వస్తువు కాదు...
ఊహ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ, ప్రపంచానికి సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తుంది...
చదవడం, రాయడం, మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది..
పుస్తకాలు మన ఊహ శక్తిని మెరుగు పరుస్తాయి..
పుస్తకాలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి.. జీవిత పాఠాలు నేర్పిస్తాయి..
అన్నింటిని మించి పుస్తకాలు మంచి నేస్తాలు"...
అని చెప్పారు రేఖ వాళ్ళ అమ్మగారు...

ఇదంతా విన్న సుష్మ నేను కూడా ఒకసారి ట్రై చేసి చూస్తాను... నేను మరీ పుస్తకాల పురుగుని కాలేను కానీ,,
ఒక అద్భుతమైన అలవాటు ఆలవర్చుకోవటానికి ప్రయత్నిస్తాను అని మాట్లాడుతూ తినటం ముగించారు......

పుస్తక పఠనం ఒక వ్యాపకం మాత్రమే కాదండీ... ఏది మంచో, చెడో తెలుసుకుని అడుగేసే విశ్లేషణ విజ్ఞతను పెంపొందిస్తుంది..
ఇప్పటికే స్మార్ట్ ఫోన్ మోజులో పడి,,,
పుస్తకాలు అటకెక్కాయి..
తల్లులుగా చిన్న బాధ్యత తీసుకొని,
మన పిల్లలకు పుస్తక పఠనం గురించి,
దాని ప్రాముఖ్యత గురించి తెలియజేసి,
వారు పుస్తక పఠనానికి మొగ్గు చూపే విధంగా ఒక అడుగు వేద్దాం....

*******--------------*********
మరి మీరు ఏమంటారో?? కామెంట్స్ లో తెలియజేయండి..
అక్షర దోషాలు ఉంటే మన్నించండి....

✍️ కీర్తి సురేష్....
ధన్యవాదాలు....🙏


3, మే 2023, బుధవారం

"నేను"

అమ్మాయిలకు మొదటి రజస్వలకాగానే

"పవిత్రంగా భావించి " పండుగలా జరుపుతారు...

అదే రెండోసారి పీరియడ్ రాగానే ,,,,

"అపవిత్రంగా భావించి"  పండుగలకుదూరం చేస్తారు...

ఇది అపవిత్రత కాదు ........

ఒక ఆడపిల్ల ఉనికి......

 ఒక స్త్రీ అస్తిత్వం .....

మనలోనే అమ్మతనం.....

✍️ కీర్తి సురేష్....🙏

"అమాయక బాలచంద్రులు"...

 




పని మొత్తం త్వరగా కానిచ్చి
ఈ రోజైనా కాస్త నడుం వాల్చాలి.. అబ్బా!...
బాగా నడుం నొప్పి వస్తుంది. "పిల్లలు సెలవులు ఏమో గాని తల ప్రాణం తోకకు వస్తుంది".
అసలు విశ్రాంతి తీసుకోవటానికి టైం దొరకటం లేదని గబగబా పని కానిచ్చి, గుమ్మంలో అడుగుపెడుతుండగానే, గోడ వైపు చూసి గట్టిగా అరిచింది లావణ్య.
"ఒరేయ్ పండుగా ఏంట్రా అది?
ఏం చేసావురా? "
అని వాడి దగ్గరికి వెళ్లి వాడి బట్టలు తడిమి చూసి హమ్మయ్య!!
అని ఊపిరి పీల్చుకుంది...
ఇంతకీ వీడు ఏమి చేశాడా? అని గోడ దగ్గరికి వెళ్లి చూసింది. వీడేదో క్రియేటివిటీ బిల్డ్ చేస్తాడని క్లే కొనిపెట్టాను.
పండుగాడు "ఆ తెల్లటి గోడ మీద పసుపు రంగు
క్లే తీసుకొని గోడంతా వాడికి నచ్చినట్టు పూసాడు".
వీడి క్రియేటివిటీ పాడుగాను.......
ఇదా..!వీడు చేసిన నిర్వాకం... అమ్మో!...బ్రతికించాడు..
ఎక్కడ మోషన్ కూర్చుని ఇలా చేశాడేమో?
అని హడలి చచ్చాను...
ఇంకెక్కడ విశ్రాంతి?
ఇప్పుడు ఈ గోడ శుభ్రపరిచేసరికి సరిపోతుంది. ఈ లోపు మళ్ళీ సాయంత్రానికి స్నాక్స్, రాత్రికి భోజనం అన్ని తయారు చేయాలి.
ఈ పిల్లాడి అల్లరితో పిచ్చెక్కిపోతుంది.
అమ్మో!! నా పని అయిపోయింది భగవంతుడా.... అని అనుకుంది లావణ్య.




మరుసటి రోజు లేవగానే యథా ప్రకారం
వండీ, వార్చి, భర్త ఆఫీస్ కి వెళ్ళగానే పని చేసుకుంటుంది. ఈలోపు పండు గాడు వచ్చి,

అమ్మా...! రా అమ్మా.... నీకు ఒకటి చూపిస్తాను. అని అన్నాడు.




ఏం చేశాడో ఏమో???
అనుకుంటూ వచ్చి చూస్తే, ఒకింత ఆశ్చర్యం కలిగింది.
కుండీలో ఉన్న మట్టి నేల మీద చాళ్ల వల్లే పోసి,,
ఆ చాళ్ల మధ్యలో అక్కడక్కడా బియ్యం గింజలు పోసాడు.
ఏమిటి పండు ఇదంతా???
అని అడిగింది లావణ్య.


అమ్మ నేను మొన్న టీవీలో చూశాను...
ఇలానే మట్టిలో చేస్తే పెద్ద పెద్ద మొక్కలు వచ్చి, బియ్యం వస్తాయి...

అమ్మా, మనం ఇంక బజార్లో బియ్యం కొనవద్దమ్మా...
నేనే బియ్యం పెంచుతాను అని చెప్పాడు...


ఈసారి లావణ్య కి వాడు చేసిన పనికి విసుగు రాలేదు. వాడికి వచ్చిన ఆలోచనకీ,
వాడి అమాయకత్వానికీ మురిసిపోయింది...


పండు నాన్నా...!
ఇలా ఇంట్లో చేస్తే బియ్యం రావు....
కొన్ని మొక్కలు,చెట్లు అయితే,
ఇంట్లో పెంచితే పండ్లు, కూరగాయలు వస్తాయి...
కానీ బియ్యం పొలంలో పండించాలి.. అని వాడికి అర్థం అయ్యేలా చెప్పింది లావణ్య.
పండు సరే అని మళ్ళీ ఆడుకోవడానికి వెళ్లిపోయాడు...

ఆ మట్టి అంతా శుభ్రం చేసుకుంటూ
ఒక్కోసారి వీడు చేసే అల్లరి పనులకు పట్టరాని కోపం వస్తుంది.
ఒక్కోసారి వీడి ఆలోచనా శక్తికి మెచ్చుకోకుండా ఉండలేను..
ఒక్కోసారి వీడి అమాయకత్వం చూస్తే జాలేస్తుంది.



ఇల్లు అన్నాక పిల్లలు,,
పిల్లలు అన్నాక అల్లరిమామూలే...

వాళ్ళు ఎంత అల్లరి చేసినా భరిస్తాం... అవసరమైతే ఒక దెబ్బ వేస్తాం...
కానీ చిన్న గాయమైనా, కంటి నుండి చుక్కనీరు కార్చినా తట్టుకోలేక తల్లులుగా విలవిల్లాడిపోతాం.

నిజమే కదండీ!!!
 
" పిల్లలు అమావాస్య ఎరుగని చందమామలు"...

వాళ్ళ అమాయక అల్లరే,,,
మనకు మానసిక స్వాంతన.....

వాళ్ళ కల్మషం ఎరుగని చిరునవ్వే,,,
మన మానసిక బాధలకు ఔషధం....

మరి మీరేమంటారో???
కామెంట్స్ లో తెలియపరచండి...
నా స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి....
అక్షర దోషాలు ఉంటే మన్నించండి...

✍️ కీర్తి సురేష్......
 ధన్యవాదాలు....🙏
 
 

"ఆపద్బాంధవులు "

 

సరిగ్గా 8 ఏళ్ల వయసు... టీవీ చూస్తుంటే అప్పుడే ఒక సినిమా ప్రసారం కావటం మొదలైంది. ఆ ఉపోద్ఘాత సన్నివేశం నాకు నచ్చి సినిమా చూస్తూ మా అమ్మని అడిగాను. "అపద్బాంధవుడు" అంటే అర్థం ఏమిటి? అని. దానికి ఆవిడ నవ్వుతూ "దైవం మనుష్య రూపేణా" అని మనం ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకునే వారిని ఆపద్బాంధవుడు అంటారు అని చెప్పింది. అప్పుడు విన్న మాటలు, చూసిన సినిమా అర్థం చేసుకునే వయసు లేకపోయినా సినిమా మొత్తం చూశాను.అదే సినిమా కొనేళ్ల తర్వాత చూసి భావోద్వేగానికి గురయ్యాను. చిరంజీవి గారి నటన, కె. విశ్వనాధ్ గారి దర్శకత్వం నన్ను ఆకట్టుకున్నాయి.


*********


ఇక అసలు విషయానికి వస్తే పావని , రవిల ఏకైక పుత్రిక దివ్య. వయసు పది సంవత్సరాలు ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్లో ఐదవ తరగతి చదువుతోంది. మహా తెలివిగలది. చలాకీగా ఉండే పిల్ల.ఇంట్లో ఒక్కతే ఆడపిల్ల కావడంతో గారాబంగా పెంచారు. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఆడుకోవడానికి నా దగ్గరికి వస్తూ ఉంటుంది.ఆటలు పూర్తయ్యాక, చదువు, హోంవర్క్ అంతా ముగించి గాని వెళ్ళదు ఇంటికి. దివ్య ఉంటే నాకు సమయం ఎలా గడిచి పోతుందో కూడా తెలియదు. వేసవికాలం కావడంతో ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. ఒకరోజు దివ్య నా దగ్గరికి వచ్చి
ఆంటీ ...!ఆంటీ..!
ఈరోజు మధ్యాహ్నం స్కూల్ నుండి వస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా?? అంటూ దీర్ఘాలు తీసింది ఒక ఇంత ఆశ్చర్యం , భయం కలగలిపిన స్వరంతో.
ఏం జరిగిందో నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది?? అన్నాను వెటకారంగా!!,

అబ్బా... ముందు నువ్వు చెప్పేది విను ఆంటీ అంది విసుగుగా,. సరే సారీ చెప్పు అన్నాను. నేను మరీ ,స్కూల్ నుండి ఇంటికి వస్తున్నాను. వస్తూవుంటే ఒక అన్న రోడ్డుకి అటు, ఇటు పడిపోతున్నట్టుగా నడుస్తున్నాడు. అక్కడ ఉన్నవాళ్లేమో చూడండి ఈ కాలం పిల్లలు ఎలా చెడిపోతున్నారో?, మిట్ట మధ్యాహ్నం ఈ వయసులో ఎలా తాగి తూలుతూ వెళ్తున్నాడో అని అనుకుంటున్నారు. కానీ నాకు ఏమీ అర్థం కాలేదు .

హా తర్వాత ?ఏం జరిగింది?
అని అడిగాను నేను.
ఆ అన్న కింద పడిపోయాడు రోడ్డుమీద కానీ, ఎవరూ లేపలేదు కూడా, షర్ట్ అంతా దుమ్ము, మట్టి ఉన్నాయి.కానీ నాకు అన్నను చూస్తే పాపం అనిపించింది .అక్కడే ఒక ఇంటి గేటు దగ్గర వాచ్మెన్ అంకుల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి చెబితే అతను వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశాడు. అంబులెన్స్ వచ్చి అన్న ని ఎక్కించుకొని వెళ్లే వరకు చూస్తూ ఉన్నాను అని చెప్పింది. "బంగారు తల్లి దివ్య చాలా మంచి పని చేసింది" అన్నాను మెచ్చుకోలుగా, నా బుగ్గను ముద్దాడి మా మంచి ఆంటీ అని ఇంటికి పరిగెత్తింది...

************
రెండు రోజుల తర్వాత దివ్య వాళ్ళ అమ్మ బజార్ కి వెళుతూ దివ్యని చూసుకోమని నాకు అప్పగించి వెళ్ళింది. ఎవరో గేటు దగ్గర నుండి ఏమండీ? ఏమండీ? అని పిలవగా వచ్చి ఎవరు కావాలి? ఏం కావాలి ? అని అడిగాను. ఇక్కడ దివ్యా? అని ప్రశ్నార్థకంగా అడిగింది ఒక 50 ఏళ్ల వయసున్న ఆవిడ తనతో పాటు ఒక 25 సంవత్సరాల వయసున్న మరో వ్యక్తి. హా రండి కూర్చోండి. అని ఆహ్వానించి త్రాగటానికి మంచి నీరు ఇచ్చాను. దివ్యా? అని వాళ్ళు మళ్ళీ అంటుండగానే,దివ్య వచ్చి మొన్న రోడ్డు మీద పడిపోయింది ఈ అన్నే అని చెప్పింది. అవును అండి నా పేరు లక్ష్మి ,వీడు నా కొడుకు మేము పక్క వీధిలోనే ఉంటాము. మొన్న మా వాడు బయటకు వెళ్లి వస్తుంటే ఉన్నట్టుండి బాగా నీరసం వచ్చి పడిపోయాడట.
తాగి పడిపోయాడేమో? అని ఎవరూ సాయం కూడా రాలేదట, కానీ మీ పాప వచ్చి అంబులెన్స్ కి ఫోన్ చేయించిందని అక్కడ వాచ్మెన్ చెప్పాడు ఒకసారి పాపని కలిసి కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాను తల్లీ,. నా ప్రాణాన్ని కాపాడింది మీ అమ్మాయి బంగారు కొండ. నా కొడుకే నాకు సర్వస్వం. నా ప్రాణాన్ని నాకు తిరిగి ఇచ్చింది మీ పాప, అని దివ్యని హత్తుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లీ అని దీవించింది.
ఆవిడ అన్న ఒక్క మాట" మీ పాప" అని, "ఇలాంటి మంచి మనసున్న బంగారు తల్లి మరొక జన్మంటూ ఉంటే నా కడుపున పుట్టాలని", మనసులో అనుకుంటూ దివ్యని గట్టిగా హత్తుకున్నాను ....

ఒక్కొక్కసారి మనం చేసే చిన్న సాయమే ఎదుటివారికి పెద్ద మేలు చేకూరుస్తుంది...

"To help a friend is good,
To help yourself is good,
To help a stranger is very best thing"..

అక్షర దోషాలు ఉంటే క్షమించి,,,
దయచేసి మీ అభిప్రాయంకామెంట్స్ లో తెలియజేయగలరు.....
*****ధన్యవాదాలు 🙏*****
✍️ కీర్తిసురేష్.....


" క్షణికావేశం"...




అంతా మంచే జరుగుతుంది. జాగ్రత్తగా వెళ్లి రా అమ్మా , అని ఫోన్లో చెబుతున్న తండ్రితో సరే నాన్నా టైం అవుతుంది సాయంత్రం వచ్చాక మాట్లాడుతాను. అని ఫోన్ కట్ చేసి హడావిడిగా ఇంటి నుండి బయటపడింది రమ్య క్యాబ్ బుక్ చేసుకొని కాలేజీకి వచ్చింది కాలేజీ ఆవరణమంతా విద్యార్థులతో నిండి హడావిడిగా ఉంది. లోపల గదిలోకి వెళుతూ హాల్ టికెట్,ఐడి కార్డ్ ,పెన్ వంటి పరీక్ష సామాగ్రి మరొకసారి చెక్ చేసుకుని లోపలికి వెళ్ళింది......
*******************
రమ్య ఒక పల్లెటూరిలో పుట్టి పెరిగిన అమ్మాయి. చదువులో చాలా చురుకుగా ఉండేది. ఈ మధ్యనే బీటెక్ పూర్తి చేసి, సిటీలో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉంది. పార్ట్ టైం జాబ్ చేస్తూ, ఊరిలో ఉన్న తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తన జీవితం కొనసాగిస్తుంది రోజులు చాలా వేగంగా దొర్లుతున్నాయి..

అమ్మా నాన్న నేను ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించాను అని ఆనందంగా చెప్పింది. తల్లిదండ్రులకు వారు ఎంతగానో సంతోషించి నువ్వు తప్పకుండా నీ జీవిత గమ్యాన్ని చేరుకుంటావు తల్లీ , అని దీవించాడు తండ్రి, చదువు చదువు అని ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా వేళకు తిను అని ప్రేమగా కసిరి జాగ్రత్త చెప్పింది తల్లి.
కూతురి గురించి ఆలోచిస్తూ ఆనంద పరవశలయ్యారు ఆమె తల్లిదండ్రులు.
*******************

మెయిన్స్ కి సన్నద్ధం అయ్యేందుకు మరింత కష్టపడి చదువుతుండగా, రమ్య స్నేహితురాలు ఫోన్ చేసింది. ఫోన్లో విషయం వినగానే గుండె పగిలినంత పని అయింది రమ్యకి వెంటనే తన ఫోన్లో వార్తలు చూస్తుండగా, పలానా తేదీన జరిగిన పరీక్ష పేపర్లు లీక్ అవటం వలన పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో పేపర్ల లీకేజీ విషయమై సమగ్ర దర్యాప్తు చేస్తామని రద్దు చేసిన పరీక్షలకు తేదీలు ప్రకటించి తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని ఆ వార్తల సారాంశం.




ఒక్కసారిగా ఇలాంటి వార్త విన్న రమ్య మనసు కకావికలమైంది. అసలే సున్నిత మనస్కురాలు అవటం వలన పరిపరి విధాల ఆలోచించసాగింది. అనాలోచితమైన నిర్ణయం తీసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కూతురుని విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. గుండెలవిసేలా రోదిస్తున్న వారి వేదన వర్ణనాతీతం.

"కొందరు అవినీతిపరుల స్వార్థానికి బలైపోతున్న రమ్య లాంటి విద్యార్థులు జీవితాల్నీ, తల్లిదండ్రులకు బిడ్డలను కోల్పోయిన బాధనీ, ఎవరు భర్తీ చేయగలరు? వారికి జరిగిన నష్టాన్నీ ఎవరు పూడ్చగలరు? "
ఇటువంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ,
ఎవరిది ఈ నేరం?????

"అనాలోచితంగా తొందరపడి నిర్ణయం తీసుకున్న రమ్యదా?....,
సరిగా పరీక్షలు నిర్వహించలేని ప్రభుత్వానిదా?..,
ధనదాహంతో అడ్డదారులు తొక్కుతున్న స్వార్థపరులదా?..."

ఎవరిని నేరస్థులను చేయగలం?
ఎవరిని ప్రశ్నించగలం...?

భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో పోటీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన రమ్యలాంటి , ఎంతోమంది యువత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవలేదని, రాత పరీక్ష సరిగా రాయలేదనీ,ఎవరో ఏదో అన్నారనీ, ఆర్థికంగా వెనుకబడిపోయారనీ ,క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో తల్లిదండ్రులకు తీరని శోకాన్నీ,గుండె కోతనీ, మిగిల్చి వెళ్లిపోతున్నారు.

ఎటువంటి నిర్ణయం తీసుకునే ముందు అయినా ఒకసారి మీ గురించి బాధపడే మీ కుటుంబం గురించి, మీ శ్రేయోభిలాషుల గురించి ఆలోచించండి. వివేకవంతులే సరైన నిర్ణయాలు తీసుకొని,సరైన మార్గంలో ప్రయాణించండి.🙏




హాయ్ అండి, నేను కీర్తి, 

ఈ మధ్య జరిగిన పేపర్ లీకేజీ విషయమై విద్యార్థులు మనోవేదన నన్ను కలిచి వేసింది

దానికి తోడు నిన్న డాన్స్ మాస్టర్ ఆత్మహత్య కూడా చాలా భాధ కలిగించింది.

 ఇటువంటి సంఘటనలు  రోజూ ఏదో ఒకటి వింటూనే ఉంటున్నాం….          నిరంతరం ఎన్నో రకాల వార్తలు చూస్తూనే ఉంటున్నాం….

 నా భాధ మీతో పంచుకోవాలనిపించి  నా భావాలు అక్షరరూపం దాల్చాయి. ఏమైనా తప్పులు ఉంటే సమీక్షించి మీ విలువైన సలహాలు ఇవ్వగలరు....
*****ధన్యవాదాలు.****


✍️ కీర్తి సురేష్....

 

మల్లెకు మనసుంటే -1

ఆహా!!! ఏమి నా అదృష్టం...... నేను మానవాళికి దొరికిన గొప్ప బహుమతి.... అరవిరిసిన అందంతో..... నేను దోచిన మగువల చూపులేన్నో... దోసిలి ...