3, మే 2023, బుధవారం

" క్షణికావేశం"...




అంతా మంచే జరుగుతుంది. జాగ్రత్తగా వెళ్లి రా అమ్మా , అని ఫోన్లో చెబుతున్న తండ్రితో సరే నాన్నా టైం అవుతుంది సాయంత్రం వచ్చాక మాట్లాడుతాను. అని ఫోన్ కట్ చేసి హడావిడిగా ఇంటి నుండి బయటపడింది రమ్య క్యాబ్ బుక్ చేసుకొని కాలేజీకి వచ్చింది కాలేజీ ఆవరణమంతా విద్యార్థులతో నిండి హడావిడిగా ఉంది. లోపల గదిలోకి వెళుతూ హాల్ టికెట్,ఐడి కార్డ్ ,పెన్ వంటి పరీక్ష సామాగ్రి మరొకసారి చెక్ చేసుకుని లోపలికి వెళ్ళింది......
*******************
రమ్య ఒక పల్లెటూరిలో పుట్టి పెరిగిన అమ్మాయి. చదువులో చాలా చురుకుగా ఉండేది. ఈ మధ్యనే బీటెక్ పూర్తి చేసి, సిటీలో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉంది. పార్ట్ టైం జాబ్ చేస్తూ, ఊరిలో ఉన్న తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా తన జీవితం కొనసాగిస్తుంది రోజులు చాలా వేగంగా దొర్లుతున్నాయి..

అమ్మా నాన్న నేను ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించాను అని ఆనందంగా చెప్పింది. తల్లిదండ్రులకు వారు ఎంతగానో సంతోషించి నువ్వు తప్పకుండా నీ జీవిత గమ్యాన్ని చేరుకుంటావు తల్లీ , అని దీవించాడు తండ్రి, చదువు చదువు అని ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా వేళకు తిను అని ప్రేమగా కసిరి జాగ్రత్త చెప్పింది తల్లి.
కూతురి గురించి ఆలోచిస్తూ ఆనంద పరవశలయ్యారు ఆమె తల్లిదండ్రులు.
*******************

మెయిన్స్ కి సన్నద్ధం అయ్యేందుకు మరింత కష్టపడి చదువుతుండగా, రమ్య స్నేహితురాలు ఫోన్ చేసింది. ఫోన్లో విషయం వినగానే గుండె పగిలినంత పని అయింది రమ్యకి వెంటనే తన ఫోన్లో వార్తలు చూస్తుండగా, పలానా తేదీన జరిగిన పరీక్ష పేపర్లు లీక్ అవటం వలన పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో పేపర్ల లీకేజీ విషయమై సమగ్ర దర్యాప్తు చేస్తామని రద్దు చేసిన పరీక్షలకు తేదీలు ప్రకటించి తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని ఆ వార్తల సారాంశం.




ఒక్కసారిగా ఇలాంటి వార్త విన్న రమ్య మనసు కకావికలమైంది. అసలే సున్నిత మనస్కురాలు అవటం వలన పరిపరి విధాల ఆలోచించసాగింది. అనాలోచితమైన నిర్ణయం తీసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కూతురుని విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. గుండెలవిసేలా రోదిస్తున్న వారి వేదన వర్ణనాతీతం.

"కొందరు అవినీతిపరుల స్వార్థానికి బలైపోతున్న రమ్య లాంటి విద్యార్థులు జీవితాల్నీ, తల్లిదండ్రులకు బిడ్డలను కోల్పోయిన బాధనీ, ఎవరు భర్తీ చేయగలరు? వారికి జరిగిన నష్టాన్నీ ఎవరు పూడ్చగలరు? "
ఇటువంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ,
ఎవరిది ఈ నేరం?????

"అనాలోచితంగా తొందరపడి నిర్ణయం తీసుకున్న రమ్యదా?....,
సరిగా పరీక్షలు నిర్వహించలేని ప్రభుత్వానిదా?..,
ధనదాహంతో అడ్డదారులు తొక్కుతున్న స్వార్థపరులదా?..."

ఎవరిని నేరస్థులను చేయగలం?
ఎవరిని ప్రశ్నించగలం...?

భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో పోటీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన రమ్యలాంటి , ఎంతోమంది యువత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవలేదని, రాత పరీక్ష సరిగా రాయలేదనీ,ఎవరో ఏదో అన్నారనీ, ఆర్థికంగా వెనుకబడిపోయారనీ ,క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో తల్లిదండ్రులకు తీరని శోకాన్నీ,గుండె కోతనీ, మిగిల్చి వెళ్లిపోతున్నారు.

ఎటువంటి నిర్ణయం తీసుకునే ముందు అయినా ఒకసారి మీ గురించి బాధపడే మీ కుటుంబం గురించి, మీ శ్రేయోభిలాషుల గురించి ఆలోచించండి. వివేకవంతులే సరైన నిర్ణయాలు తీసుకొని,సరైన మార్గంలో ప్రయాణించండి.🙏




హాయ్ అండి, నేను కీర్తి, 

ఈ మధ్య జరిగిన పేపర్ లీకేజీ విషయమై విద్యార్థులు మనోవేదన నన్ను కలిచి వేసింది

దానికి తోడు నిన్న డాన్స్ మాస్టర్ ఆత్మహత్య కూడా చాలా భాధ కలిగించింది.

 ఇటువంటి సంఘటనలు  రోజూ ఏదో ఒకటి వింటూనే ఉంటున్నాం….          నిరంతరం ఎన్నో రకాల వార్తలు చూస్తూనే ఉంటున్నాం….

 నా భాధ మీతో పంచుకోవాలనిపించి  నా భావాలు అక్షరరూపం దాల్చాయి. ఏమైనా తప్పులు ఉంటే సమీక్షించి మీ విలువైన సలహాలు ఇవ్వగలరు....
*****ధన్యవాదాలు.****


✍️ కీర్తి సురేష్....

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మల్లెకు మనసుంటే -1

ఆహా!!! ఏమి నా అదృష్టం...... నేను మానవాళికి దొరికిన గొప్ప బహుమతి.... అరవిరిసిన అందంతో..... నేను దోచిన మగువల చూపులేన్నో... దోసిలి ...